Login to HTCA
Please fill the below credential
"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః" అన్న ఆర్యోక్తి ఆధారంగా, "కారెవరూ పాటకనర్హం" అనే స్ఫూర్తితో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా, అభిలాష, ఆసక్తి ఉన్న అందరినీ అలరిస్తూ, ఆహూతులను పాటలతో పరవశింప చేస్తున్న ఒక విలక్షణమైన సాంస్కృతిక కార్యక్రమమే ఈ స్వరమాధురి. లాభాపేక్ష లేకుండా, స్వచ్ఛంద కార్యకర్తలే నిర్వాహకులుగా హ్యూస్టన్ నగరంలోని తెలుగు వారందరినీ కలుపుకుపోతున్న ఈ కార్యక్రమం శాస్త్రీయ, లలిత, జానపద, చలనచిత్ర గీతాల సమ్మేళనా విభావరి.
కేవలం వినోదమే ప్రధానంగా సాగే కరియోకీ కార్యక్రమాలకు భిన్నంగా స్వరమాధురి తన ప్రస్థానాన్ని వినోద, విజ్ఞాన, వికాసాల సమ్మేళనంగా కొనసాగిస్తోంది. గానాసక్తి ఉండి, శ్రుతి, లయ జ్ఞానాన్ని లేదా గాన వైవిధ్యాన్ని పెంపొదించుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం స్వరమాధురి శిక్షణా తరగతులను (workshops) ప్రముఖ సంగీతజ్ఞులు మరియు స్వరమాధురి మెంటర్, సంగీత దర్శకులు, గాయకులు నేమాని పార్థసారథి గారిచే నిర్వహింపజేసి, గాయకుల ప్రతిభను సాన బట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా పలువురు ప్రముఖులు, ప్రఖ్యాత స్వరజ్ఞులు వింజమూరి అనసూయగారు, మాధవపెద్ది సురేష్, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు తదితరులు స్వరమాధురి కార్యక్రమాలలో ముఖ్య అతిధులుగా విచ్చేసి, గాయకులందరినీ అభినందించి ప్రోత్సహించారు.
స్వరమాధురి గాయకులకు పాట చూడకుండా పాడే అలవాటు చేయటం ద్వారా వారికి పాటలోని భావాన్ని గ్రహించి, వేదికపైనుంచి ప్రేక్షకులను చూస్తూ ఆ భావాన్నిప్రతిబింబిస్తూ పాడే స్వభావాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది. దీనివలన తెలుగు భాషా పరిజ్ఞానం కూడా పెంపొందింపబడుతోంది. అంతే కాదు, కొన్ని సందర్భాలలో స్వరమాధురి ఒక అంశం ప్రాతిపదికగా పాటలు పాడే అవకాశాలని గాయకులకు కల్పించింది. అందువలన గాయకులకు వివిధ సందర్భాలకు, అంశాలకు సంబంధించిన పాటలు పాడే అవకాశం కలిగి ఒక పరిపక్వతకు దారితీయవచ్చు అన్నది నిర్వాహకుల అభిప్రాయం.
స్వరమాధురిలో ఏ రకమైన పోటీలు ఉండవు. "ఎవరికి వారే అసలైన పోటీ" అన్న భావానికి అనుగుణంగా నిరంతర విద్యార్థిగా ఒక గాయకుని ప్రస్థానాన్ని ప్రోత్సహించే అరుదైన సంస్థ స్వరమాధురి. అందుకేనేమో స్వరమాధురి బాల గాయకులు కొందరు "పాడుతా తీయగా" వంటి ప్రముఖ సంగీత పోటీలలో విశిష్ఠ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి, ఆ పోటీలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్నది మన స్వరమాధురి గాయని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాము. బహు భాషలలో పాటలు పాడించడం ద్వారా భాషా వైవిధ్యాన్ని కూడా స్వరమాధురి ప్రోత్సహించడం ముదావహం.
మరొక ప్రత్యేకత ఏమిటంటే, సమాజ సేవా కార్యక్రమాలు చేసే శంకర నేత్రాలయం వంటి స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరించటంకోసం సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ, "నేను సైతం" అని సేవా చంద్రునికో నూలు పోగునర్పించడానికి నడుం కట్టిన సంస్థ స్వరమాధురి.
సంగీతము, గానములతో పాటు వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా గాయకులలో కలిగిస్తున్న స్వరమాధురి, హ్యూస్టన్ నగరంలోని తెలుగువారి కళాతృష్ణకి ఒక కలికితురాయి అని విజ్ఞుల అభిప్రాయం. అందుకే, ఒక సారి స్వరమాధురికి అలవాటు పడ్డాకా మళ్ళీ ఇంకే ఇతర సంగీత కార్యక్రమాలు అంతగా నచ్చవు అంటే అతిశయోక్తి కాదేమో!
https://www.youtube.com/c/SwaramadhuriHouston