Login to HTCA
Please fill the below credential
మాతృభాష తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఇచ్చే గొప్ప వరం. గర్భస్త శిశువు నుంచి బుడిబుడి నడకల వయస్సు వరకూ ప్రతి చిన్నారి వినే భాష మాతృభాష. అది వారికి ఒక వ్యక్తిత్వము ఏర్పడడానికి, ఈ వసుధైక కుటుంబములో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోవటానికి దోహదం చేస్తుంది. మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన, గౌరవభావం ఏర్పడడానికి, భావ వ్యక్తీకరణ పెంపొందించుకోవటానికి ఎంతగానో సహాయపడుతుంది.
2008లో షుగర్లాండ్లో అష్టలక్ష్మి గుడి ప్రాంగణములో ఆరుగురు విద్యార్ధులతో ప్రాణం పోసుకుని, 2014లో సైప్రస్స్ లో, 2017లో కేటీలో కూడా తెలుగు బడి విస్తరించింది.ఎంతో అంకితభావం, భాషాభిమానం కల ఉపాధ్యాయులు స్వచ్ఛందముగా అందించే సేవలు తెలుగు బడి విజయానికి మూల కారణం.
తేనెలూరు తెలుగులోనిమాధుర్యాన్ని ఆస్వాదించమని, ఎందరో తెలుగు మహా కవుల కలముల నుండి జాలువారిన రచనలలో నిక్షిప్తమై ఉన్న నిగూఢార్థాలని వెలికితీయమని తెలుగు వారందరికీ పిలుపునిస్తోంది. అవని నలువైపుల తెలుగు వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షిస్తూ, మన భాషను పరిరక్షించుకోవాలనే సంకల్పముతో ముందడుగు వెస్తోంది తెలుగు బడి.
ఈ తరగతుల, ఆయా భాషా భాగాల బోధనను మెరుగు పరచడానికి తెలుగుబడి కేంద్రాలు నిరంతరం కృషి చేస్తున్నాయి.
తెలుగుబడి ఆయా కేంద్రాలు నిర్వహించే భాషా బోధన కార్యక్రమాలు కాకుండా, అన్ని కేంద్రాల వారు సమిష్టిగా నిర్వహించే కార్యక్రమాలు ఈ సంస్థ యొక్క ఐకమత్యానికీ, సంఘీభావనకీ పట్టుకొమ్మలుగా నిలుస్తాయి.
తెలుగుబడి విద్యార్థులే కాకుండా, ఇతర భాషాభిమానులు కూడా పాలు పంచుకోవటం సం TCA తెలుగుబడి ప్రతి ఏటా “తెలుగు భాషా పోటీలు” నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింపబడే ఈ పోటీలలో హ్యూస్టన్ నగరంలోని ఎందరో ఔత్సాహికులైన పిల్లలు పాల్గొని తెలుగు చదవడంలో, వ్రాయడంలో, పద విజ్ఞానంలో, వక్తృత్వ, పద్య పఠనాలలో తమ ప్రతిభా పాటవాలతో ఆహ్వానితులను అలరించి మెప్పిస్తూ ఉంటారు. ఈ పోటీల స్ఫూర్తితో ప్రతి సంవత్సరమూ మరెంతో మంది తమ పిల్లలకి తెలుగు నేర్పించటానికి ప్రేరణ పొందుతారు. ఇలాంటి ‘భాషా పోటీలు” హ్యూస్టన్ నగరంలో మరి ఏ ఇతర తెలుగు విద్యా సంస్థ మొదలు పెట్టలేదు.
ఇది తెలుగుబడి విద్యార్ధులు ఎగురవేస్తున్న విజయకేతనం. భాష మీద మమకారం ఉంటే చాలు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మన భాషని మనం నేర్చుకోవచ్చు. తెలుగు భాషాభిమానం, భావితరాలకు మన భాష నేర్పాలన్న తపన తెలుగు బడిని ముందుకు నడిపిస్తోంది. తెలుగు భాష మన అమ్మ భాష. మన పిల్లలకి మనం తెలుగు నేర్పించుకోవటానికి, అదే ప్రతి తెలుగువారికీ ఒక అర్హతను, అధికారాన్నీ ఇస్తుంది. తెలుగుబడి ఉపాధ్యాయుల కృషి ఫలించాలంటే తల్లి తండ్రుల ప్రోత్సాహం, పట్టుదల, బోధనా ప్రక్రియలో వారి క్రియాశీల పాత్ర ఎంతో అవసరం. అది ఉన్నంతవరకూ, తెలుగు భాష ఎప్పటికీ అవని నలువైపులా వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది.