Latest Updates
Vaggeyakarotsavam
వాగ్గేయకారోత్సవం
జూన్ 9 వ తేది శనివారం రోజు శ్రీ అష్ట లక్ష్మీ దేవాలయ ప్రాంగణం లో జరిగిన వాగ్గేయకారోత్సవం లో హ్యూస్టన్ నగరం లోని సంగీతజ్ఞులూ, రసికులు ఉత్సాహం గా పాల్గొని తెలుగు వాగ్గేయకారులందరికీ ఘన నివాళులు అర్పించారు. తెలుగు సాంస్కృతిక సమితి , భారతీయ వాహిని మరియూ స్వరభారతి సంస్థలు ఈ ఉత్సవానికి ఆధ్వర్యం వహించారు.
ఉదయం 10:00 గంటలకు ప్రారంభించి రాత్రి 9:00 గంటలవరకూ జరిగిన ఈ సంగీతారాధన లో సుమారు 170 మంది కళాకారులూ, 300 పైగా రసజ్ఞులూ పాల్గొనడం విశేషం. వాగ్గేయకారోత్సవం సభ్యులు శ్రీమతి శ్రీదేవి జోశ్యుల , శ్రీమతి నీరజ సెత్లుర్ ర్ జ్యోతి ప్రజ్వలన గావించగా, శ్రీమతి జానకి పేరి, శ్రీయతులు సీతారాం అయ్యగారి, సుధేష్ పిల్లుట్ల, కాంత్ జోశ్యుల , కృష్ణ పసుమర్తి మున్నగు వారు పాల్గొన్నారు.
శ్రీ సుధేష్ పిల్లుట్ల గారి స్వాగత వచనాలతో మొదలైన కార్యక్రమం లో ముందుగా జరిగిన , శ్రీరామదాసు విరచిత నవరత్న కీర్తన ల బృంద గానానికి ఆహూతులు భక్తి పారవశ్యులయ్యారు . సంగీత కళానిధి కీ|| శే శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు స్వరపరచిన ఈ నవరత్న కీర్తనలను శ్రీ మతి శ్రీదేవి జోశ్యుల బృందం (సుమారు 40 మంది) భక్తి ప్రపత్తుల తో గానం చేశారు. వీరికి వీణపై శ్రీ శాస్త్రి వేదం , వయోలిన్ పై చి. ముకుంద్ జోశ్యుల, మృదంగం పై చి. విశాల్ సెత్లూర్ , శ్రీ రవి తమిరశ మున్నగు వారు ప్రతిభావంతం గా సహకరించారు .
తదనంతరం , శ్రీ ఇంద్రదీప్ ఘోష్ బృందం వాయులీన వాద్య కచేరి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తదుపరి, స్థానిక హ్యూస్టన్ సంగీత ఉపాధ్యాయులు , వారి శిష్యులూ తమదైన రీతిలో తెలుగు వాగ్గేయకారులు రచించిన కీర్తనలూ, కృతులూ ఆలపించి ఆహూతులను అలరించారు . ఈ సంగీత యజ్ఞం లో, వారి శిష్యుల తో పాల్గొన్న ఉపాధ్యాయులు ముఖ్యం గా , శ్రీ అయ్యగారి సీతారాం , శ్రీమతులు గంటి అపర్ణ, అనూరాధ సుబ్రహ్మణ్యం, భారతి అన్నపూర్ణ యద్దనపూడి , శర్వాణి ధూళిపాళ, శ్రీదేవి జోశ్యుల, ప్రేమా భట్, మధుర శంకర్ , రాజరాజేశ్వరి భట్, మరియూ మాణిక్యం వెన్నెలకంటి మున్నగు వారు ప్రశంసనీయులు. ఈ కార్యక్రమాలకు శ్రీ సుధేష్ పిల్లుట్ల మరియూ శ్రీ సీతారాం అయ్యగారి వ్యాఖ్యాతలు గా నిర్వహించారు. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు, శ్రీ కిరణ్ మద్దినేని, సభ్యులు, శ్రీమతి ఇందిరా చెరువు, శ్రీమతి జానకి పేరి , శ్రీ రామ్ ఉప్పలపాటి ప్రభృతులు సంగీతోపాధ్యాయులకూ, కళాకారులకూ జ్ఞాపికలు బహుకరించారు.
స్థానిక సంగీత విద్యాలయ ప్రదర్శనల అనంతరం, శ్రీమతి ప్రీత మరియూ జయంత్ బాలసుబ్రహ్మణ్యం గార్ల బృందం చే జరిగిన వాద్య లహరి కచేరి రసజ్ఞులను సంగీత రస వాహిని లో ఓలలాడించి ,మైమరపించినది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. శ్రీమతి సంగీత వెన్నెలకంటి గారి పరిచయ వాక్యాలతో ప్రారంభించబడిన ఈ కచేరీలో శ్రీమతి . ప్రీతా నారాయణ స్వామి (వీణ) శ్రీ అభిషేక్ బాలకృష్ణన్ (వయోలిన్ ) చి. ముకుంద్ జోస్యుల (వయోలిన్ ) శ్రీ జయంత్ బాల సుబ్రహ్మణ్యం (మృదంగం) చి. విశాల్ సెత్లూర్ (మృదంగం) మరియూ కు. సంయుక్త శ్రీరామ్ (ఘటం) లు వారి వారి వాద్యాల పై ప్రదర్శించిన రీతి అభినందనీయం. పరి పరి నీ పదమే (డా|| మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి రచన) హంసధ్వని రాగం- ఆదితాళం తో ప్రారంభించిన వీరి కచేరీలో , వందే వాసు దేవం - శ్రీ రాగం - ఖండచాపు తాళం ( శ్రీ అన్నమాచార్య రచన) , నినువినా నా మదెందు - నవరస కన్నడ - ఆదితాళం - (శ్రీ త్యాగరాజ స్వామి) , ఒకపరికొకపరి - ఖరహరప్రియ - అది తాళం -శ్రీ అన్నమాచార్య ప్రధానాంశం గా సాగిన వీరి కచేరీలో, రాగమాలికా తానం (సావేరి - బేహాగ్ - మాండ్ - మున్నగు రాగాలు) ఒక ప్రత్యేక ఆకర్షణ . ప్రధానాంశం అనంతరం సాగిన తానియావర్తనం రసజ్ఞులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రముఖ సాహతీ వేత్త శ్రీ వంగూరి చిట్టెన్నరాజుగారు , ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉమా ఇయ్యుణ్ణి గారు కళాకారులను జ్ఞాపికలతో గౌరవించారు . కాంత్ జోస్యుల వందన సమర్పణ తో వాగ్గేయకారోత్సవం ఘనం గా ముగిసింది . ఆద్యంతం, భక్తి ప్రపత్తులతో , రక్తి గా సాగిన ఈ వాగ్గేయకారోత్సవానికి విచ్చేసిన ప్రేక్షకులకూ పాల్గొన్న కళాకారులకూ శ్రీ గాయత్రి భవన్ వారు భోజన ఫలహారాలు అందించారు. శ్రీ కృష్ణ పసుమర్తి, శ్రీమతులు . ఉష అయ్యగారి, మహతి విట్టల , బిందు పొన్నపల్లి, సుధా రాణి సాంబ రాజు మున్నగు వారు భోజన సదుపాయాలను పర్యవేక్షించారు. శ్రీమతులు, లలిత రాచకొండ, జయశ్రీ బొండు మున్నగువారు కార్యక్రమ నిర్వాహణకు సహకరించగా, కర్రా శ్రీనివాస్ గారు , కాంత్ జోస్యుల సౌండ్ అండ్ ఆడియో సిస్టం లను పర్యవేక్షించారు.
To view the photo gallery visit http://www.houstontca.org/photo-gallery.html
Sponsors
-
Video Gallery
- Post Feedback
-
Follow us on