Latest Updates
TCA History
తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్,
సంక్షిప్త చరిత్ర
టెక్సస్ అనగానే గుర్రాలూ, తుపాకులూ , పేద్ద పది గేలన్ల టోపీలూ అనుకుని, ఇవన్నీ మనకెందుకులే అనుకుని భారతీయులు, అందునా తెలుగు వారు అమెరికాలో ఇతర రాష్టాలకి మాత్రమే వలస వరస కట్టిన రోజులలో, విశాఖపట్నానికి చెందిన (స్వర్గీయ) దువ్వూరి అచ్యుత అనంత సత్య నారాయణ రావు గారు , కుటుంబ సమేతంగా , ఆస్ట్రేలియా, కెనడాలలో చదువు తరవాత హ్యూస్టన్ లోని టెక్సస్ సదర్న్ యూనివర్శిటీలో ఫిజిక్స్ విభాగం ప్రారంభించడానికి 1957 లో హ్యూస్టన్ వచ్చారు. ఆయనే టెక్సస్ కి, అమెరికా లోని ఇతర దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి తెలుగు వారు.
ఆ తరువాత పదేళ్ళలో 1970 నాటికి పట్టిసపు రామజోగి గంగాధరం గారు, పోతు నరసింహారావు గారు మొదలైన కుటుంబీకులూ, అనిల్ కుమార్, మణ్యం మూర్తి, గుంటూరు సీతాపతి రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావు, చింతపల్లి అశోక్ కుమార్ లాంటి బ్రహ్మచారులూ వెరసి ఇంచుమించు 20 మంది తెలుగు వారు హ్యూస్టన్ లో నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పుడు అందరూ ముందు భారతీయులూ, తరవాతే తెలుగు వారు. భారతీయులందరూ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో కలుసుకుని హిందీ సినిమాలు వేసుకునీ, పిక్నిక్స్ జరుపుకునే వారు. తెలుగు పండుగలకీ, తెలుగులో మాట్లాడుకోవడానికీ నారాయణ రావు గారు, నరసింహా రావు గారూ, గంగాధరం గారి ఇళ్ళలో అందరూ కలుసుకునే వారు. వారందరి “లివింగ్ రూము” లే ఆ నాటి తెలుగు సాంస్కృతిక వేదికలు. ఆ నాటి తొలి తెలుగు వారిలో చాలా మంది ఇప్పటికీ హ్యూస్టన్ లోనే ఉండడం, అందులో కొంత మంది ఇంకా ఈ నాటి మన తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పుకోదగ్గ విశేషమే!
ప్రెసిడెంట్ కెన్నెడీ హత్యానంతరం, ఆయన తలపెట్టిన “Liberalised immigration policies” 1960 దశాబ్దం చివరి సంవత్సరాలలో అమలు లోకి వచ్చినప్పటినుంచీ అమెరికాకే కాకుండా హ్యూస్టన్ నగరానికి కూడా భారతీయులూ, తెలుగు వారు అధిక సంఖ్య లో తరలి వచ్చారు. మొత్తం భారతీయులందరినీ కలుపుకునే ఇండియన్ అసోసియేషన్స్ ప్రాధాన్యత తగ్గక పోయినా, మెల్ల, మెల్లగా ప్రాంతీయ భాషా సంఘాల ప్రారంభం మొదలయింది. 1975 ప్రాంతాలకి హ్యూస్టన్ లో ఇంచుమించు యాభై మంది తెలుగు వారు సమకూడారు. వారిలో ఐదారుగురు నాటకాలూ, శాస్త్రీయ సంగీతమూ, కూచిపూడి నృత్యమూ మొదలైన కళలలో అతున్నతమైన మంచి ప్రావీణ్యం ఉన్న కళాకారులు కూడా ఉండడంతో, అందరూ మామూలుగా కలుసుకోవడం, పండగలు చేసుకోవడమే కాకుండా, ఏదో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండేవి. అవన్నీ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, టెక్సస్ సదరన్ యూనివర్శిటీ లేదా మెడికల్ సెంటర్ ఉన్న హాళ్ళలో జరిగేవి. అప్పటికే అమెరికా ఇతర పెద్ద నగరాలలో తెలుగు సంఘాలు, వాటితో చిన్న, చిన్న రాజకీయాలు మొదలయ్యాయి. హ్యూస్టన్ లో 1975 లో కూడా ఆలోచనలు వచ్చాయి కానీ, ఒక తెలుగు సంఘం నిజంగా అవసరమా, ఒక వేళ తెలుగు సంఘం పెట్టుకుంటే, రాజకీయాలకి అతీతంగా దాన్ని ఎలా తీర్చిదిద్దాలనీ అని ఒక ఏడాది పాటు రక రకాల చర్చలు జరిగాయి. మొత్తానికి 1976 లో తెలుగు సాంస్కృతిక సమితి అనే పేరుతో హ్యూస్టన్ లో లాభాపేక్ష లేని సంస్థగా వెలిసింది. ఆ సమితి ఆశయాలనికీ, నిర్మాణ నిబంధనావళి (Constitution) రచించడానికీ దువ్వూరి నారాయణ రావు, పోతు నరసింహా రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావులతో ఒక కమిటీ చెయ్యబడింది. వారు అందరితో చర్చలు జరిపి, అప్పటికే దేశంలో ఉన్నమూడు, నాలుగు తెలుగు సంస్థల తీరుతెన్నులూ, సమస్యలూ పరిశీలించి తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదట Constitution ప్రచురించారు. వంగూరి చిట్టెన్ రాజు తెలుగులో అక్షరరూపం కలిగించి, హ్యూస్టన్ లో ఉన్న తెలుగు వారందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ క్రింది తొలి పత్రంలో తెలుగు సాంస్కృతిక సమితి ఆశయాలు:
“తెలుగు భాష మీద తెలుగు సంస్కృతి మీద అభిమానము, అభిరుచి గల వ్యక్తుల సమన్వయమీ తెలుగు సాంస్కృతిక సమితి. లాభాపేక్ష, రాజకీయ విషయములలో జోక్యము చేసుకునే ఆసక్తి లేనిదిది. సభ్యులు తరచు కలుసుకొనుటకు, తెలుగు సంస్కృతికి సంబంధించిన కార్యకలాపములలో పాల్గొనుటకు అవకాశాములను కల్పించుటే ఈ సమితి ప్రధానాశయము. ఈ ప్రాంతములోని తెలుగు వారి సమైక్యతను పెంపొందించి, వారి సంస్కృతికి సంబంధించిన అవసరములు తీర్చుటయే కాక ఆ సంస్కృతిని తెలుసుకోవాలనే ఆపేక్షగల హ్యూస్టన్ మహానగర నివాసుల వాంఛాసాఫల్యమునకు కూడా ఈ సమితి తోడ్పడుతుందని ఆశించవచ్చును”
ఈ కమిటీ వారు మన సాంస్కృతిక సమితికి “అధ్యక్షులు” అనే పదవి అధికారకాంక్షను పెంచే విధంగా ఉండి, రాజకీయాలకు దారి తీస్తుందని భావించి, సమితి సభ్యులందరూ కలసి ఏడుగురు వ్యక్తులను నిర్వాహక వర్గం సభ్యులుగా ఎన్నుకోవాలనీ, ఆ ఏడుగురూ తమలో తామే ఒకరిని “సమన్వయ కర్త” గానూ, మరొకరిని “సహ సమన్వయ కర్త” గానూ నిర్దేశించుకుని, సమితి కార్యకలాపాలన్నింటినీ సమిష్టిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం, 1977 జనవరిలో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి కార్యనిర్వాహక వర్గానికి కోనేరు తాతయ్య సమన్వయ కర్త గానూ, వంగూరి చిట్టెన్ రాజు సహ సమన్వయ కర్త గానూ, పుచ్చా వసంత లక్ష్మి, పోతు రాజేశ్వరి, తుమ్మల కుటుంబ రావు, పట్టిసపు గంగాధరం, కొడాలి సుబ్బారావు గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
1977 ఉగాది మన మొట్టమొదటి అధికారిక కార్యక్రమం. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, స్ట్యూడెంట్ సెంటర్ మూడవ అంతస్తులో ఉన్న హ్యూస్టన్ రూమ్ లో జరిగిన ఆ నాటి తొలి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులలో కొందరు పొలాని జానకి రామయ్య, శారద, బిలకంటి గంగాధర్, రవి తమిరిస, కిరణ్ తమిరిస, పుచ్చా వసంత లక్ష్మి, రత్నపాప, అనిల్ కుమార్, వంగూరి చిట్టెన్ రాజు, కామేశ్వరీ గంగాధరం, రూపా కోనేరు, రఘు చక్రవర్తి, చావలి రామసోమయాజులు, బాల, చేగు లలిత, విజయ మరియు రాధ దేవరకొండ, దువ్వూరి సూరి, హీరా, గొల్లపూడి మణి, రేణుకా రెడ్డి, తోట రాణి, సూర్యకుమారి మహాబలి, జానీ బేగమ్, తుమ్మల కుటుంబ రావు మొదలైన వారు., ఈ నాటితో పోల్చి చూసుకుంటే, ఆ నాడు చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే హ్యూస్టన్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారందరూ…నూటికి నూరు పాళ్ళూ ఆ ఉగాది కార్యక్రమానికీ, ఆ తరువాత అనేక సంవత్సరాలు అన్ని కార్యక్రమాలకీ అదే సంఖ్యలో వచ్చి మన తెలుగు సాంస్కృతిక సమితిని ప్రోత్సహించారు. ఆనాటి ఆహూతుల సంఖ్య సుమారు వందమంది తెలుగు వారు. అప్పటినించీ, అనేక సంవత్సరాలు మన ఆడపడుచులే కలిసి, మెలిసి వంటలు చేసి అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశేవారు. మన నగరానికి వచ్చిన గొప్ప, గొప్ప అతిథులు అందరూ తెలుగు వారి ఇళ్ళలోనే ఆత్మీయ ఆతిధ్యం పొందేవారు.
అప్పటినుంచి (1976), ఇప్పటి దాకా, అన్ని ఒడుదుడుకులనీ తట్టుకుని, అన్ని సమస్యలనీ సామరస్యంగా పరిష్కరించుకుని, ఉత్తర అమెరికా మొత్తంలో ఒకే తాటిపై నడుస్తున్న ఏకైక అమెరికా తెలుగు సంస్థ అని ప్రపంచవ్యాపంగా అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన తెలుగు సాంస్కృతిక సమితి ఇక ముందు కూడా అదే బాటలో పయనించి, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకి మరింత సేవలు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
Sponsors
-
Video Gallery
- Post Feedback
-
Follow us on